రాఖీ పౌర్ణమి విశిష్టమైనది

అమరావతి: రాఖీ పౌర్ణమి సందర్బంగా రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగు వారందరికీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మంత్రి పరిటాల సునీత, మాజీ మంత్రి పీత సుజాత, తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి, కృష్ణా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ అనురాధ, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆచంట సునీత, పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ సతీమణి రజనీ, బ్రహ్మకుమారీలు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు సీతక్క, దూలం రాధిక తదితరులు ఆయనకు రాఖీలు కట్టారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. శ్రావణమాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి ఎంతో విశిష్టమైనదని అన్నారు. రైతాంగానికి శ్రావణ పౌర్ణమి శుభ సూచకమన్నారు. పంటలు బాగా పండాని, సిరులు కురిపించాలని నేలతల్లికి పూజలు చేసి నాట్లు వేసే సమయం ఇదేనన్నారు. మమతానురాగాలకు, ప్రేమానుబంధాలకు రాఖీ పండుగ నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డకు తమ ప్రభుత్వం రక్షణ కవచంలా ఉంటుందని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న మహిళల కోసం అభయహస్తం యాప్‌ను రూపొందించినట్లు చెప్పారు. మహిళ ఆరోగ్య రక్షణకు తమ ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందని చంద్రబాబు చెప్పారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *