అరకులో హెలీ టూరిజం (araku loo heli tourisam)

ఆదాయ వనరుల పెంపునకు కృషి—
ఎవరెస్టు ఎక్కడం గర్వకారణం—
ప్రభుత్వ కృషి అభినందనీయం: గవర్నర్‌—
విశాఖ: విశాఖ జిల్లా అరకు ప్రాంతంలో హెలీ టూరిజంను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ జిల్లా అరకు నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలను నిర్వహించింది. ఎన్టీఆర్‌ మైదానంలో జరిగిన ఈ వేడుకను గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అంతకు ముందు గిరిజన నృత్య ప్రదర్శనను గవర్నర్‌, సీఎం తిలకించారు. గిరిజన యువతులతో కలిసి వారిద్దరూ ధింసా నృత్యం చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. కూచిపూడి నృత్యం తరువాత ప్రభుత్వం థింసా నృత్యానికి ఆ స్థాయిలో ప్రచారం కలిపిస్తోందని చెప్పారు. దేశ, విదేశాల్లో థింసా నృత్య ప్రదర్శను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. పర్యాటకానికీ సరికొత్త ఉత్సాహం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా అరకుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. అరకులో ఏడాదిలోగా రహదారులను విస్తరించి సుందరంగా తయారు చేస్తామన్నారు.అరకు ఎకో టూరిజం సర్క్యూట్‌ ను రూ.110కోట్లలతో పూర్తి చేస్తామన్నారు. లంబసింగి, దల్లాపల్లిలో రిసార్టు ఏర్పాటుకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అరకులో బెలూన్‌ ఫెస్టివల్‌, వాటర్‌ ఫాల్‌, ఎల్లో ఫ్లవర్‌ ఫెస్టివల్స్‌ను ఏటా నిర్వహిస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఆదాయ వనరుల్ని పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు సీఎం వెల్లడిరచారు. కాఫీ, మిరియాల పంట ద్వారా మంచి ఆదాయ వచ్చేందుకు అవకాశాలున్నాయన్నారు. ప్రకృతి సేద్యాన్ని బాగా విస్తరించేందుకు ఈ ప్రాంతంలో అవకాశాలున్నాయన్నారు. ఆర్గానిక్‌ ఆహార పదార్థాలకు ఎంతో ఆదరణ ఉందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే ఆర్థికంగా గిరిజనులు బలపడేందుకు అవకాశం ఉందన్న సీఎం రూ.10 వేలు కనీస ఆదాయాన్ని కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యార్థులు చదువు, క్రీడపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన విద్యార్థులు ఎవరెస్టు ఎక్కడం ఎంతో గర్వకారనమన్నారు. రెసిడెన్షియల్‌ పాఠశాలలకు విద్యార్థులను పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. అరకును మెడికల్‌ అండ్‌ హెల్త్‌ హబ్‌ గా తయారు చేస్తామన్నారు. అనారోగ్యం బారిన పడిన వారు ఈ ప్రాంతంలో నాలుగు రోజులు ఉంటే కోలుకునే అవకాశం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. అరకు బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిని గవర్నర్‌ నరసింహన్‌ అభినందించారు. అరకులో నేచర్‌ క్యూర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. అరకుకు నవ్య అరకు అని పేరుపెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నక్కా ఆనందబాబు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, జడ్పీ ఛైర్‌ పర్సన్‌ లాలం భవానీ స్థానిక ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *