టిడిపిలో ముదిరిన వర్గ విభేదాలకు తెరపడేదెప్పుడు ? (tdploo mudhirina varga vibedhalaku therapaday dheppudoo?)

పోలవరంలో కొయ్యగూడెం కుంపటి …?—
కార్యకర్తలకు…నాయకులకు…ప్రజాప్రతినిధులకు పెరుగుతున్న అంతరం—
ముఖ్య ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయలేమి పార్టీ పటిష్టతకు శాపం—
22న కొయ్యగూడెం మండంలో జరిగే జిల్లా సమన్వయ కమిటీ సమావేశమైనా పరిష్కరించేనా ?—-
కొయ్యగూడెం, (పశ్చిమ గోదావరి జిల్లా) : 2014 ఏప్రిల్‌, మే నెలల్లో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లోను, రాష్ట్ర శాసనసభ, పార్లమెంటుకు జరిగిన సార్వత్రిక ఎన్నికలోను జిల్లాలో ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టి తిరుగులేని అధిపత్యాన్ని కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోని కొందరు ముఖ్య ప్రజాప్రతినిధులకు పొసగక, వారిమధ్య సమన్వయం లేక, నాయకులు, కార్యకర్తలు కూడా వారి..వారి నాయకుల, ప్రజాప్రతినిధులననుసరించి వర్గాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితి జిల్లా ప్రజలకు, పార్టీ సర్వాధినేత చంద్రబాబు నాయుడు కూడా తెలియని రహస్యమేమీ కాదు. అధినేత స్వయంగా హెచ్చరించినా ముఖ్య ప్రజాప్రతినిధులోను, ముఖ్యనాయకులోను మార్పు రాలేదు. ఈ పరిణామాలతో కొందరు నాయకులు, కార్యకర్తలు ఆధిపత్యం కోసం వీధిన పడుతున్నారు. పరిస్థితిని క్షేత్రస్థాయిలోనే సమీక్షించి సరిదిద్దానే యోచనతో పార్టీ అధినేత ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మంత్రిని పార్టీలో సమన్వయం కుదర్చటానికి 4 నెలల క్రితమే నియమించారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతానికి చెందిన ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో పోలవరం ఎంఎల్‌ఏ మొడియం శ్రీనివాసరావు` ఏలూరు ఎంపి మాగంటిబాబు మధ్య సమన్వయం అసులేదు. వారిమధ్య ఇగోకి సంబంధించిన పొరపచ్చాలు, అధిపత్య భావన ఉన్నట్లు పార్టీ సీనియర్‌ నాయకులు, అభిప్రాయపడుతున్నారు. అలాగే చింతలపూడి నియోజకవర్గంలో కూడా స్థానిక ఎంఎల్‌ఏ మాజీ మంత్రి పీతల సుజాత, ఎంపి మాగంటిబాబు మధ్య నిప్పులకుంపటి రాజు కొంటుందని అంటున్నారు. వారిమధ్య సమన్వయం, సఖ్యత లేదనటానికి చింతలపూడి మార్కెట్‌ కమిటీ పాలకవర్గ అధ్యక్షుడు నియామక వ్యవహారమే ఉదాహరణగా చెప్పవచ్చు. జంగారెడ్డిగూడెం, మరికొన్ని మండల పార్టీ అధ్యక్షుల నియామక అంశంలో కూడా ఇక్కడ పార్టీ నాయకులు వీధికెక్కారు. పోలవరం నియోజకవర్గంలో కొయ్యలగూడెం మండలం పెద్దాది అత్యధిక జనాభా, అత్యధిక ఓటర్లు ఇక్కడ ఉన్నారు. నియోజకవర్గంలో ఎంఎల్‌ఏకి 15 వేల ఓట్లు ఆధిక్యత లభిస్తే వాటిలో 10 వేల ఓట్లు మెజారిటీ కొయ్య గూడెం మండలంలోనే లభించింది. జడ్‌పిటిసి 10 వేల ఓట్లు ఆధిక్యతతో గెలుపొందగా, 22 మంది ఎంపిటిసి స్థానాలకు గాను 20 స్థానాలు తెలుగుదేశం పార్టీకి ప్రజలు కట్టబెట్టారు. మండలంలోని 2 ఎంపిటిసి స్థానాలను గెలిపించటంతో పాటు ఎంఎల్‌ఏ, ఎంపిల ఎన్నికలో 5 వందలకు పైగా ఓట్లు అధిక్యతను యిచ్చిన రాజవరం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని ఎన్నికల సందర్భంగా హమీని ఇచ్చిన ప్రజాప్రతినిధి గడిచిన మూడేళ్లలో ఆ గ్రామాన్ని సందర్శించకపోవటం విమర్శలకు తావిస్తోంది. ఎంఎల్‌ఏ, ఎంపిలు ఇద్దరు ఎవరికి వారు ఒంటెత్తుపోకడలతో ఎవరికివారే…యమునాతీరేగా వ్యవహరిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలులో భయాందోళనలు పుట్టిస్తున్నారనే అసంతృప్తి పార్టీ నాయకులు, శ్రేణులలో వ్యక్తమవుతుంది. ఎంపి ఇంటి వద్ద ఒక నాయకుడిని కానీ కార్యకర్త ఉన్నట్లు పత్రికల్లో వచ్చినా, తెలిసినా ఎంఎల్‌ఏ వర్గం అతనిని దూరంగా ఉంచుతున్నారని అలాగే ఎంఎల్‌ఏ వర్గీయుడని తెలిస్తే ఎంపి వర్గం దగ్గరకు రానీయటం లేదని నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. పరిస్థితి ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే ఎంపి, ఎంఎల్‌ఏల మధ్య సమన్వయం లేక వారి నుంచి ఆహ్వానం లేక గత మూడేళ్లలో ఈ మండలంలో మంత్రి కానీ, జడ్‌పి అధ్యక్షుడు కానీ, ఎవరూ అధికారిక పర్యటనకు రాలేదు. ఒకసారి బయ్యనగూడెం పిహెచ్‌సి ప్రారంభోత్సవానికి వైద్య ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాసరావు, జడ్‌పి ఛైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు మండలంలో పర్యటించారు. అయితే బయ్యనగూడెంలో ఎంఎల్‌ఏ వర్గీయు, ఎంపి వర్గీయుల మధ్య గొడవ జరిగి కార్యక్రమం రసాభాసగా కావటంతో సభ, సమావేశాలు నిర్వహించకుండానే ఎంపి మాగంటి బాబు, మంత్రి కామినేని, జడ్‌పి ఛైర్మన్‌ బాపిరాజు వెళ్లిపోయారు. ఇరువురి మధ్య సఖ్యత లేక కొన్ని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు మంజూరులో ఆటంకాలు ఎదురవుతున్నట్లు కార్యకర్తలు చెపుతున్నారు. ఇక కొయ్యగూడెం మండల కమిటీకి, పట్టణ కమిటీకి, పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంపికలో ఏర్పడిన తీవ్ర ప్రతిష్టబంభన ఇక్కడ కార్యకర్తలలో కూడా వర్గ బేధాలకు, అధిపత్య పోరుకు నిదర్శనమని అంటున్నారు. ఎన్నికల ముందు, ఎన్నిక తర్వాత ఇతర పార్టీ నుంచి నాయకులకు, వారి అభిప్రాయాకు లభిస్తున్న విలువ ఆది నుంచి పార్టీకి కట్టుబడి ఉన్న నాయకుల అభిప్రాయాలకు ఇవ్వటం లేదని విమర్శులు వినవస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలోను, ప్రభుత్వ కార్యక్రమాలోను అభివృద్ధి పనులకు నిధులు మంజూరులోను, ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికీ తొలి ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శులు ఆగ్రహం, అసంతృప్తి కార్యకర్తలలో గూడుకట్టుకుంది. జిల్లాలోని కొయ్యలగూడెం మండలం కొయ్యలగూడెం పట్టణాలకు మినహా మిగిలిన అన్ని మండలాలు, పట్టణాలకు పార్టీ కమిటీ అధ్యక్ష, కార్యదర్శుల ఎంపిక ఖరారయింది. సంక్షేమ పథకాలు అమలులో కూడా పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని, తమను దూరం పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు.
22న జిల్లా సమన్వయ కమిటీ సమావేశం :
ఈనె 22వ తేదీన పోలవరం నియోజకవర్గం పరిధిలోని కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం వై.జంక్షన్‌ వద్దగల రాజ్యలక్ష్మీ కళ్యాణ మండపంలో పార్టీ జిల్లా సమన్వయ కమిటీ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పోలవరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని ముఖ్య ప్రజాప్రతినిధుల మధ్య అంతరాలపై చర్చించి చక్కదిద్దే యోచనతో ఇక్కడ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుందని తెలుస్తోంది. ఏలూరు పార్లమెంటు నియెజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎంపి మాగంటి బాబు, ఎంఎల్‌ఏ శ్రీనివాసరావులతో పాటు కొందరు రాష్ట్ర మంత్రులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, ఎంపిలు, ఎంఎల్‌ఏలు జిల్లా పార్టీ పరిశీలకుడు, పార్టీ ముఖ్యనాయకులు ఈ సమన్వయ సమావేశంలో పాల్గొంటారు. ఉదయం 10 గంట నుంచి భోజన సమయం వరకు జిల్లాలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చ జరుగుతుందని మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోలవరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఎంపి, ఎంఎల్‌ఏ మధ్య సమన్వయం లేకపోవటం, కార్యకర్తల సమస్యపై చర్చ జరుగుతుందని, పార్టీ ముఖ్య నాయకులు ఒకరు “ఏపీ న్యూస్‌ 9” ప్రతినిధికి చెప్పారు. ఈ సమావేశంలోనైనా పరిస్థితి మారుతుందేమో చూడాలి మరి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *