డెల్టాకు సాగునీటి విడుదలపై ప్రణాళికలేదు (deltaku saguneeti vidudhalapi pranalikaledhu)

ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా): కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదలపై ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక లేదని ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్‌ విమర్శించారు. స్ధానిక అన్నే భవనంలో మంగళవారం కృష్ణా డెల్టా సాగునీరు` రైతుల ఇబ్బందులు అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెదపాడు, ఏలూరు, దెందులూరు మండలాల్లో 58 వేల ఎకరాల కృష్ణా డెల్టా ఆయకట్టు భూములున్నాయన్నారు. గత అనేక ఏళ్ళుగా సక్రమంగా నీరందక కృష్ణా డెల్టా రైతులు, కౌలురైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. గత ఏడాది 30 వేల ఎకరాల్లో ఖరీఫ్‌, రబీ పంటలు లేవన్నారు. ఈ సంవత్సరం సమృద్దిగా నీరందిస్తామని పంటలు వేసుకోండని, అధికార్లు, ప్రజాప్రతినిధులు చెప్పటంతో సాగుకు సమాయత్తమయ్యారని వివరించారు. ప్రస్తుతం 10 వేల ఎకరాలకు పైనా సాగునీరందక నాట్లు వేయలేకపోయారని, నాట్లు వేసిన చేలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. తూర్పులాకు వద్ద పంపుతో నీరు తోడుతామని, జానంపేట నుండి తమ్మిలేరులోకి పట్టిసీమ కాల్వ నుండి నీరు వదుతామని చెబుతూ గ్రామాల్లో రైతులు ఎకరానీరుకు రూ.500లు ఇవ్వాలని అనధీకారంగా డబ్బు వసూలుకు సిద్దమయ్యారని ఆరోపించారు. గతంలో కూడా తూర్పులాకు వద్ద పంపు నుండి నీరు తోడేందుకు రైతుల నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేశారని గుర్తు చేశారు. రైతుకు సాగునీరందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. కృష్ణా డెల్టా శావారు భూములకు సాగునీరందించి రైతులు, కౌలురైతును ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బండిరత్తయ్య, పిట్టా ధామస్‌ తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *