రెండు వారాల్లో రజనీ కొత్త పార్టీ..! (two weeks loo rajni kotha party..!)

గాంధీయ మక్కళ్‌ ఇయక్కం అధ్యక్షుడు తమిళరువి మణియన్‌ ధీమా
చెన్నై: మరో రెండు వారాల్లో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొత్త పార్టీ ప్రారంభిస్తారని గాంధీయ మక్కళ్‌ ఇయక్కం అధ్యక్షుడు తమిళరువి మణియన్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ తమిళ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో… సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను పోయెస్‌ గార్డెన్‌లోని ఆయన నివాసంలో ఇటీవల రెండుసార్లు కలిశానన్నారు. ఈ సందర్భంగా సుమారు 3 గంటలకుపైగా ఆయనతో మాట్లాడానని, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించామని వివరించారు. రాష్ట్ర ప్రజలపై రజనీకాంత్‌కు అపరిమిత అభిమానం ఉందని, తనకు జీవితాన్నిచ్చిన తమిళులకు ఏదైనా మంచి చేయాలని ఆయన ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. 40 ఏళ్ల కిందట చెన్నైకి రావడం.. సినీ ప్రపంచంలో తమిళులు తనను ఆదరించడాన్ని ఆయన కృతజ్ఞతాభావంతో జ్ఞప్తికి తెచ్చుకున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే భావనతోనే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఆయనకు ఉందని, రాజకీయాల్లోకి కచ్చితంగా వస్తానని తనతో చెప్పారని తెలిపారు. నేను రాజకీయాల్లోకి డబ్బు సంపాదన కోసం రావాలని అనుకోవడం లేదు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ఆయన పలుమార్లు తనతో చెప్పారని గుర్తు చేశారు. తమ కోసం ఎలాంటి ఆస్తులు కూడబెట్టుకోకుండా కామరాజర్‌, అన్నాదురై ప్రజలకు సేవ చేశారని, వారే తనకు ఆదర్శం అని పదేపదే చెప్పారని, అందువల్ల వారి మార్గంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తారని విశ్వసిస్తున్నానని తెలిపారు. మరో రెండువారాల్లో ఆయన కొత్త పార్టీ ప్రారంభిస్తారని, అప్పుడు కొన్ని వాగ్దానాలను కూడా ప్రకటిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అందులో దక్షిణ నదుల అనుసంధానం, అవినీతి రహిత పారదర్శక పరిపాలన వంటివి ఉండొచ్చని ఆశిస్తున్నట్లు వివరించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *