మొట్టమొదటి ఉపరాష్ట్రపతి వెంకయ్యే

న్యూఢిల్లీ: భారత 13వ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ముప్పవరపు వెంకయ్య నాయుడు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టినవాళ్లలో ఉపరాష్ట్రపతి చేపట్టిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు.ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో గుర్తు చేయగానే సభ్యులంతా చప్పట్లతో హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. వెంకయ్య 1949, జూలై 1న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో జన్మించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాలులో వెంకయ్య నాయుడి చేత ఉప రాష్ట్రపతిగా ప్రమాణం చేయించారు. అనంతరం నేరుగా రాజ్యసభకు వెళ్లిన వెంకయ్య చైర్మన్‌ పీఠంపై కూర్చొని సభను నడిపించారు. కొత్త ఉపరాష్ట్రపతి వెంకయ్యకు ప్రధాని మోదీ, విపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్‌, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ స్వాతంత్య్రం తరువాత జన్మించిన వాళ్లలో ఉపరాష్ట్రపతి అయిన మొట్ట మొదటి వ్యక్తి వెంకయ్య నాయుడు. ఇదొక అరుదైన సందర్భం. కేంద్ర మంత్రిగా దేశానికి ఆయన ఎంతో సేవ చేశారు. ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన విజయవంతం అయినందుకు ఎవరినైనా అభినందించాంటే, అది ఒక్క వెంకయ్యను మాత్రమే! ఆయన తెలుగులో మాట్లాడితే సూపర్‌ ఫాస్ట్‌గా ఉంటుందని, ఇన్నాళ్లు మాలో న్యాయవాదిలా కలిసుండి, ఇప్పుడు న్యాయమూర్తిలా చైర్మన్‌ స్థానంలో కూర్చున్నారు అని వ్యాఖ్యానించారు. దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిలో తెలుగువారైన వెంకయ్యనాయుడు ఆశీనులయ్యారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాలులో శుక్రవారం ఉదయం భారత ఉపరాష్ట్రపతిగా ఆయన ప్రమాణం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. వెంకయ్యతో ప్రమాణం చేయించారు. ‘వెంకయ్య నాయుడు అను నేను.. రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత ప్రదర్శిస్తానని ఉప రాష్ట్రపతిగా ప్రమాణం చేస్తున్నా అంటూ హిందీలో ప్రమాణం చేశారు. అనంతరం పుస్తకంలో సంతకం చేశారు. కొత్త ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మొదటిగా రాష్ట్రపతి కోవింద్‌ అభినందించారు. అటుపై మొదటి వరుసలో కూర్చున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఉప రాష్ట్రపతికి నమస్కరించారు. 10 నిమిషాల పాటు సాగిన ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, విపక్షాలకు చెందిన కీలక నేతలు, రాష్ట్రాల సీఎంలు, పలు దేశాల రాయబారులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు రాజ్‌ఘాట్‌కు వెళ్లిన వెంకయ్య జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. సర్దార్‌ వల్లభాయి పటేల్‌, దీన్‌దయాళ్‌ ఉపాద్యాయలకు కూడా వెంకయ్య పుష్పాంజలి ఘటించారు.
సభ్యులందరూ నాకు సమానమే: వెంకయ్య
సభలో అన్ని పార్టీ సభ్యులు తనకు సమానమేనని రాజ్యసభ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందుబాటులో ఉన్న సమయం ఆధారంగా సభ్యులకు అవకాశం ఇస్తామని… దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజ్యసభ ఛైర్మన్‌గా వెంకయ్యనాయుడు ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. సభలో నిర్మాణాత్మకంగా జరిగే చర్చలను మీడియా ప్రసారం చేయాలని సూచించారు. మీడియా ఎక్కువగా వివాదాలు, సంచనాలకు ప్రాధాన్యం ఇస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *