కాపులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా

కాపు ఆత్మీయ సమ్మేళనంలో సీఎం చంద్రబాబు—
విజయవాడ (కృష్ణ జిల్లా): సామాజిక న్యాయం అనేది తాను విద్యార్థి దశలోనే నేర్చుకున్నానని.. యూనివర్శిటీలోనే దానికోసం పోరాడానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన కాపు ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలోనే కాపు రిజర్వేషన్లను తొలగించారు. కాపు గురించి ఇప్పుడు మాట్లాడుతున్న నేతలు అప్పుడు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు?. ఎన్నికల ముందు నేను చేసిన పాదయాత్రలో అనేక వర్గాల సమస్యలు తెలుసుకున్నారు. సమాజంలో తాము వెనుకబడ్డామన్న కాపు ఆవేదనను గుర్తించాను. అందుకే అన్ని వర్గాలతో సమానంగా కాపులను అభివృద్ధి చేసేందుకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించాను. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి సమాజం కోసం ఏదైనా చేస్తేనే ప్రజల్లో విశ్వసనీయత వస్తుంది. నేను ఇచ్చిన హామీలను ఎవరూ గుర్తు చేయాల్సినఅవసరం లేదు. నా బాధ్యతను నేనే పూర్తి చేస్తా.’’ పేదలు ఏ సామాజిక వర్గంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. విభజనతో రాష్ట్రం చాలా నష్టపోయింది. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించినా మన రాష్ట్రం నుంచే పాలన కొనసాగించాలన్న ఉద్దేశంతోనే అమరావతికి వచ్చేశాం. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాం. సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నాం. వెనుకబడిన వర్గాలకు ఎలాంటి అన్యాయం జరగకుండానే కాపులకు రిజర్వేషన్లు ఇస్తాం. కొందరు బీసీలను రెచ్చగొట్టి వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి మాటలను నమ్మొద్దు. కాపు ఆర్థిక, ఉద్యోగ, విద్యాపరంగా వృద్ధి చెందేందుకు ఎంత చేయాలో.. అంతా చేస్తాం’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *