ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నాడు

నంద్యాల ప్రజలనూ కొనాలనుకుంటున్నారు—-
బాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మండిపాటు—-
నంద్యాల : ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్నీ అధికారంలో ఉన్న ఈ మూడున్న రేళ్లలో చంద్రబాబు నెరవేర్చలేదు. గెలిచాక ప్రతీ సామాజిక వర్గ ప్రజను వెన్నుపోటు పొడిచాడు. రాష్ట్రంలో ఎక్కడా అభివ ృద్ధి చేయలేదు. పేదకు ఇళ్లు కట్టించామని చెప్పే ధైర్యం లేదు. ఉప ఎన్నిక రాగానే చంద్రబాబుకు ప్రజలు గుర్తొచ్చారు. ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నాడు. లేకుంటే ఒక్క రూపాయి కూడా విదిల్చేవాడు కాదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదల్లేదు. ఇరిగేషన్‌ ప్రాజెక్టు నుంచి మద్యం షాపు దాకా మట్టి నుంచి ఇసుక దాకా గుడి భూముల నుంచి విశాఖ, రాజధాని భూముల దాకా దేనినీ వదిలిపెట్ట లేదు. ఇలా మూడున్నరేళ్ల కాలంలో రూ. లక్ష కోట్లు దోచుకున్నాడు. ఇప్పుడా డబ్బులో కొంత నంద్యాల ఉప ఎన్నికల కోసం ఖర్చు చేయడానికి వస్తున్నాడు. అవినీతి డబ్బుతో ఏదైనా చేయొచ్చనకుంటున్నాడు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టే.. నంద్యాల ప్రజలనూ కొనుగోలు చేయొచ్చులే అన్న అహంకారం చంద్రబాబులో కనిపిస్తోంది. అందుకే ప్రతి సామాజిక వర్గానికి ఎర వేస్తున్నాడు. బుజ్జగింపులకు దిగుతున్నాడు. మాట వినని నాయకులపై బెదిరింపులకూ వెనకాడటం లేదు. ఎలాగైనా గెలవాలని కుయుక్తులు పన్నుతున్నాడు. ఓటుకు రూ.5 వేలు ఇస్తానంటున్నాడు. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరవ రోజు సోమవారం రోడ్‌షో పద్మావతి నగర్‌ ఆర్చి నుంచి ప్రారంభమై 15వ వార్డులోని మార్కెట్‌ యార్డు, 17వ వార్డులోని ఎస్‌బీఐ కానీ, టెక్కె, 16వ వార్డులోని సుద్దుపేట, గిరినాథ్‌ సెంటర్‌, గోపాల్‌నగర్‌, 18వ వార్డులోని విశ్వనగర్‌, గాయత్రీనగర్‌, నివర్తినగర్‌, ఎన్‌జీఓస్‌ కాలనీ వరకు సాగింది. ఈ సందర్భంగా టెక్కె, గిరినాథ్‌ సెంటర్ల వద్ద జగన్‌ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. న్యాయానికి, అన్యాయానికి.. ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలలో నంద్యాల ప్రజలు న్యాయం, ధర్మం వైపు నిలిచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు మాదిరిగా నా దగ్గర డబ్బుల్లేవు. నా దగ్గర ముఖ్యమంత్రి పదవి లేదు. పోలీసు బలం నా దగ్గర లేదు. చంద్రబాబు మాదిరిగా లేనిది ఉన్నట్టుగా.. ఉన్నది లేనట్టుగా చూపించే టీవీ చానళ్లు నా దగ్గర లేవు.. అలా రాసే పేపర్లూ నా దగ్గర లేవు. చంద్రబాబు మాదిరిగా నా దగ్గర దుర్బుద్ధి లేదు. అధికారం కోసం ఎంతకైనా దిగజారిపోయే మనస్తత్వం అంతకన్నా లేదు. ఆ ప్రియతమ దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ఇంత పెద్ద కుటుంబమే నాకున్న ఆస్తి. నాన్న గారు చేసిన ఆ సంక్షేమ పథకాలు ఇంకా మీ గుండెల్లో బతికి ఉండటమే నాకున్న ఆస్తి. జగన్‌ అబద్ధం ఆడడు.. జగన్‌ మోసం చేయడు.. జగన్‌ మాట ఇస్తే తప్పడు.. జగన్‌ ఏదైనా చెబితే చేస్తాడు.. అన్న విశ్వసనీయతే నాకున్న ఆస్తి. విలువతో కూడిన రాజకీయాలు చేయడమే నా ఆస్తి. నవరత్నాలతో జగన్‌ కూడా ప్రతీ పేదవాడి ఇంట్లో వెలుగులు నింపుతాడు వాళ్ల నాన్న మాదిరిగానే అన్న ప్రజల నమ్మకమే నాకున్న ఆస్తి. దేవుడి దయ, మీ దీవెనలే నాకున్న ఆస్తి అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *