ఎలాంటి భయాలు వద్దు

దెయ్యాలు వస్తాయ్‌.. ప్రమాణాలు చేయిస్తాయ్‌—-
నంద్యాల అభివృద్ధి బాధ్యత నాదే—-
ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహనరెడ్డి—-
నంద్యాల: ‘పులివెందులను ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలనుకున్నానో, నంద్యాలను కూడా అలానే చేస్తా. నంద్యాల అభివృద్ధి గురించి ఎవరూ భయపడకండి. మీరు న్యాయానికి ఓటేయండి.. నంద్యాల అభివృద్ధి బాధ్యత నాకొదిలేయండి’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం(10వ రోజు) పట్టణంలోని సాయిబాబానగర్‌లో ఆయన పర్యటించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మూడున్నరేళ్ల చంద్రబాబు దుర్మార్గ పాలనను గుర్తు చేశారు. ‘రైతుకు 86 వేల కోట్ల రుణం మాఫీ చేస్తానని, 14 వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మహిళలను, జాబు ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు.. ఆఖరికి పసి పిల్లల జీవితాలతో కూడా ఆటలాడుకుంటున్నారు. ఏడాదిలోపు మూగ, చెవిటి పిల్లలకు మాత్రమే ఆపరేషన్లు చేస్తామంటున్నారు. అప్పటికి వారు లోపంతో బాధపడుతున్నారని గుర్తించడమే కష్టం! క్యాన్సర్‌ పేషెంట్లకు నెలకు 7, 8సార్లు కీమోథెరపీ అవసరం కాగా, 2 దఫాలకు మాత్రమే డబ్బు ఇస్తామంటున్నారు. కిడ్నీ రోగుల డయాసిస్‌ కోసం వెళితే సంవత్సరం తర్వాత రమ్మంటున్నారు. 108కి ఫోన్‌ చేస్తే డీజిల్‌ లేదనో, జీతాల కోసం డ్రైవర్లు సమ్మె చేస్తున్నారనో సమాధానం వస్తుంది. బెల్టు షాపు లేకుండా చేస్తామన్నారు.. ఇప్పుడేమో మద్యం హోండెలివరీ ఇస్తామంటున్నారు. ఇదీ మూడేళ్ల పాలనలో చంద్రబాబు సాధించిన ఘనకీర్తి’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. గడిచిన మూడున్నరేళ్లలో సీఎం చంద్రబాబు కానీ, ఆయన మంత్రులుకానీ ఒక్కటంటే ఒక్కసారైనా నంద్యాలకు రాలేదని, ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చేసరికి వాళ్లకు ప్రజలు గుర్తొచ్చారని వైఎస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. ‘నంద్యాలలో మీరు వేసే ఓటు.. చంద్రబాబు దుర్మార్గ పాలనకు చెంపపెట్టులాంటిది. న్యాయానికి, ధర్మానికి ఓటు వేయండి. నంద్యాల అభివృద్ధి విషయంలో ఎలాంటి భయాలొద్దు. ఆ బాధ్యత నాది అని జగన్‌ హామీ ఇచ్చారు. దెయ్యాలు వస్తాయ్‌.. ప్రమాణాలు చేయిస్తాయ్‌..: మూడున్నరేళ్లపాటు ప్రజాధనాన్ని కౌకోల్లగొట్టిన చంద్రబాబు.. ఆ డబ్బుతో ఎమ్మెల్యేను కొన్నారని, ఇప్పుడు ప్రజలను కూడా కొనాలనుకుంటున్నారని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. ‘నంద్యాలకు దెయ్యాలు వస్తాయి.. ఒక్కో ఓటరు చేతిలో రూ.5 వేలు పెట్టి, ప్రమాణాలు చేయిస్తాయి. మీరంతా జాగ్రత్తగా ఉండాలి. ధర్మానికి ఓటేసి దెయ్యాని పారద్రోలాలి’ అని జగన్‌ అన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *