పింఛన్లు ఇప్పించండి మహాప్రభో

ఎంఎల్‌ఏ ముప్పిడికి మొరపెట్టుకున్న దొండపూడి వృద్దు
గోపాలపురం, (పశ్చిమ గోదావరి జిల్లా): గత నాలుగేళ్లుగా పింఛన్లు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకూ ఎటువంటి పింఛను అందలేదని ప్రభుత్వ అధికారులు, నాయకులకు ఇష్టమొచ్చిన వారికి మాత్రమే పింఛన్లు రాస్తున్నారంటూ దొండపూడి వృద్దులు ఎంఎల్‌ఏ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. మండలంలోని దొండపూడిలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంఎల్‌ఏ భూమిపూజ చేసారు. సిసి రోడ్డు నిర్మాణం అనంతరం గ్రామంలోని వృద్దులు ఎంఎల్‌ఏ వద్దకు చేరుకుని నాలుగేళ్లుగా పింఛను కోసం అర్జీలు పెడుతున్నామని అనర్హులకు ఇచ్చి అర్హులకు ఇవ్వడం లేదని ఎంఎల్‌ఏ వద్ద వృద్దులు ఆగ్రహం వ్యక్తం చేసారు. జన్మభూమి కమిటీ పేరుతో అర్హులకు కాకుండా అధికార పార్టీకి చెందిన వారికి మాత్రమే ఇళ్లు, ఇంటి స్థలాలు, పింఛన్లు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఎంఎల్‌ఏ ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మరొక నెలరోజుల్లో కొత్త పింఛన్లు వస్తాయని అర్హులైన ప్రతీ ఒక్కరికి అందజేయడం జరుగుతుందన్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి అక్టోబర్‌ నెలాఖరు వరకూ రెండు నెలలు నియోజకవర్గంలో పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం జరుగుతుందన్నారు. ముందుగా ఎస్‌సి ఏరియాలో రూ. 10 లక్ష వ్యయంతో చేపట్టనున్న కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసారు. గ్రామంలో నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభించారు. సర్పంచ్‌ ఎస్‌కె పీర్‌సాహెబ్‌, ఎంపిటిసి కాసాని అనసూయ, జన్మభూమి కమిటీ అధ్యక్షులు బండారు గనిరాజు, పోతిరెడ్డి వీరాస్వామి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ జేష్ఠ శ్రీనివాసరరావు, కొర్లపాటి రాము, నందమూరి సత్యనారాయణ, గుబ్బా సీతారామయ్య, మద్దిపాటి రమేష్‌బాబు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *