భయంతోనే వైసిపి వికృత చేష్టలు

మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా
విజయవాడ: నంద్యాల ఉపఎన్నికల తర్వాత ప్రతిపక్ష వైకాపా జెండా పీకేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ఉపఎన్నికల్లో ఓడిపోతామనే ఆ పార్టీ వికృత చేష్టలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఈ కారణంగానే ఆందోళనలతో ఎన్నికలు వాయిదా వేయించాలని ఆ పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. నంద్యాలలో శాంతిభద్రతకు విఘాతం కలిగించి ఉపఎన్నికల్ని నిలుపుదల చేయించే యోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ఆ పార్టీ అధినేత జగన్‌ సీఎంను కాల్చేయాలని, ఉరితీయాలని తీవ్ర వ్యాఖ్యలతో నోరు పారేసుకుంటున్నారని మంత్రి మండిపడ్డారు. ఉపఎన్నికల ప్రచారంలో జగన్‌ అసలైన ఫ్యాక్షన్‌ నేతలాగానే మాట్లాడుతున్నారని ఆరోపించారు. మరోవైపు ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే విషయంలో ఎవరైనా రాజ్యాంగం ప్రకారమే పనిచేయాలని మంత్రి వ్యాఖ్యానించారు. వైసీపీ చేస్తోన్న కుట్రపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *