ముస్లిం మహిళకు చరిత్రాత్మకమైన రోజు

దిల్లీ: ముమ్మారు తలాక్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై పలువురు ముస్లిం మహిళలు హర్షం వ్యక్తం చేశారు. లఖ్‌నవూలోని ఆల్‌ ఇండియా ముస్లిం మహిళ పర్సనల్‌ లా బోర్డు అధ్యక్షురాలు మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు. ‘సుప్రీంకోర్టు నిర్ణయం చరిత్రాత్మకం. దేశంలోని మహిళ విజయం ఇది’ అని అఖిల భారత షియా పర్సనల్‌ లా బోర్డు పేర్కొంది. వివిధ ప్రాంతాల్లోని ముస్లిం మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సైరాభాను అనే మహిళ మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ముస్లిం మహిళల పరిస్థితిని అర్థం చేసుకోండి. తీర్పును స్వాగతించి వీలైనంత త్వరగా చట్టాన్ని చేయండి అని ఆమె కోరారు. తల్లిదండ్రులను చూసేందుకు పుట్టింటికి వెళ్లినందుకు సైరాభానుకు ఆమె భర్త రియాజ్‌ అహ్మద్‌ 2015, అక్టోబరు 15న ఓ పేపరు మీద ముమ్మారు తలాక్‌ అని రాసి విడాకులు ఇచ్చేశాడు. దీన్ని వ్యతిరేకిస్తూ ఆమె 2016, ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన లాంటి ఎంతో మంది ముస్లిం మహిళలు ఇదే పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆమె పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు కేంద్రమంత్రి మేనకా గాంధీ, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా తలాక్‌పై చట్టాన్ని తీసుకురావాలని కోరారు. పార్లమెంటులో చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆరు నెలల గడువు ఇస్తూ.. అప్పటి వరకు ఎలాంటి పిటిషన్లు తీసుకోబోమని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించిన విషయం తెలిసిందే.
కొత్త శకం ఆరంభం
‘సుప్రీంకోర్టు నిర్ణయంతో కొత్త శకం ఆరంభమైంది. ముమ్మారు తలాక్‌ రాజ్యాంగ విరుద్ధం, సమానత్వంతో జీవించే హక్కును సుప్రీంకోర్టు ముస్లిం మహిళలకు ఇచ్చింది. హక్కు కోసం పోరాడుతున్న ముస్లిం మహిళలకు అనుకూంగా వచ్చిన తీర్పును స్వాగతిస్తున్నా’ అని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *