దళిత క్రైస్తవులపై దాడులు అరికట్టాలి

యుపిఏ నియోజకవర్గ అధ్యక్షులు రెవ గాబ్రియేలు—-
గోపాలపురం, (పశ్చిమ గోదావరి జిల్లా): దళిత క్రైస్తవుల పట్ల దాడులు అరికట్టాలని, ఎస్‌సిలుగా గుర్తించి వారికి సంఘంలో సముచిత స్థానం కల్పిం చాలని యునైటెడ్‌ పాస్టర్స్‌ అసోసియేషన్‌ నియోజకవర్గ అధ్యక్షులు రెవ పాస్టర్‌ తిగిరిపల్లి గాబ్రియేలు అన్నారు. మండలంలోని వెంకటాయపాలెం దానియేలు చర్చి వద్ద యుపిఏ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న గాబ్రియేలు మాట్లాడుతూ దళిత క్రైస్తవుల పట్ల చిన్న చూపు చూస్తున్నారని హక్కుకోసం పోరాడితే దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. బిషప్‌ డి మలాకీ మాట్లాడుతూ భారతదేశంలో క్రైస్తవులకు సరైన భద్రత లేదన్నారు. గత 67 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న దళిత క్రైస్తవులను మిగిలిన వారికంటే తక్కువగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమని దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఒరిస్సాలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులు అమానుషం అన్నారు. పాస్టర్లను ఊచకోత కోయడం వంటి కార్యక్రమాలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఒరిస్సాలో జరుగుతున్న దాడులను నిలుపుదల చేయాలని ఆయన కోరారు. నల్లజర్ల మండలం అధ్యక్షులు రెవ జోజ్‌ మాట్లాడుతూ గతంలో సిక్క బౌద్ద మతస్తులను ఎస్‌సి జాబితాలో చేర్చారన్నారు. భారతదేశంలోని హిందువులకు ఇస్తున్న గౌరవాన్ని దళిత క్రైస్తవులకు ఇవ్వాలని అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేసారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు ఎస్‌ సాల్మన్‌రాజు, ఎస్‌ సూర్యకుమారి, సంపత్‌ కుమార్‌, డేవిడ్‌ రాజు, బాబూరావు, నెహేలీయా, నాగేశ్వరరావు, యుపిఏ నాయకులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *