సెప్టెంబర్‌ 8, 9 తేదీల్లో డివైఎఫ్‌ఐ మహాసభలు

ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా): భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డి.వై.ఎఫ్‌.ఐ) జిల్లా 16వ మహసభలు సెప్టెంబర్‌ 8, 9 తేదిలో ఏలూరు నగరంలో నిర్వహించనున్నట్లు ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు ప్రకటించారు. బుధవారం డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం స్ధానిక అన్నే భవనంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాము సూర్యా రావు మాట్లాడుతూ దేశానికి వెన్నుముక అయిన యువత నేడు పూర్తి నిరాశ, నిస్పృహలతో ఉన్నారని అటువంటి యువతను చైతన్యపరిచి వారిని దేశభక్తియుత పౌరులుగా తీర్చిదిద్ధేందుకు డివైఎఫ్‌ఐ ఎంతో కృషి చేస్తుందని కొనియాడారు. యువతీ, యువకులను సంఘటిత పరిచి వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ఆందోళన, పోరాటాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో డివైఎఫ్‌ఐ ముందుంటుందని అన్నారు. అటువంటి డివైఎఫ్‌ఐ జిల్లా మహాసభను జిల్లా కేంద్రం అయిన ఏలూరు నగరంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నామని ఈ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.శివకుమార్‌ మాట్లాడుతూ డివైఎఫ్‌ఐ 1980లో ఏర్పడిన తరువాత జిల్లా మహాసభను మొట్టమొదటిసారిగా ఏలూరులో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ మహాసభలో డివైఎఫ్‌ఐ ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలను, నిర్మాణాన్ని సమీక్షించుకుని రాబోయే కాలంలో చేయాల్సిన కృషిపై చర్చిస్తామని అన్నారు. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు యువతకు అనేక హామీలు ఇచ్చారని కాని వాటిలో ఏ ఒకటీ నేటికి అమలు కాలేదని విమర్శించారు. ఎన్నికలలో యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 16.5 లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగులందరికి నిరుద్యోగ భృతి రూ. 2000 ఇవ్వాని కోరుతూ రాబోయో కాలంలో నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాలను ఈ మహాసభలో రూపొందిస్తామని అన్నారు. ఈ మహాసభ ప్రారంభం సందర్భంగా 8వ తేది ఉదయం సర్‌.సి.ఆర్‌.రెడ్డి ఆడిటోరియంలో 70 ఏళ్ళ భారతదేశంలో విద్య ఉపాధి యువత అనే అంశంపై సదస్సు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా మాజి ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త కె.ఎస్‌.లక్ష్మణరావు హాజరవుతున్నారని తెలిపారు. అనంతరం మహాసభకు జిల్లా నులుమూలల నుండి 300 మంది ప్రతినిధులతో పాటు రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యారావు పాల్గొంటారని తెలిపారు. ఈ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డివైఎఫ్‌ఐ నగర నాయకులు కె.సుధీర్‌, సిహెచ్‌.భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *